Monday, February 25, 2008

వెండితెరకు నాటకం వెన్నుదన్ను

(ఆంధ్రజ్యోతిలో గొల్లపూడి మారుతీరావు వ్రాసిన వ్యాసం. వ్యాసం చివర్లో ఆయనకు నచ్చిన దృశ్య కావ్యంగా [[యోగివేమన]]ను పెర్కొన్నారు. ఆయనకు నచ్చినంతగా సినిమా నాకూ నచ్చినందుకు సంతోషం వేసింది. కావాలంటే నేనువ్రాసిన టపా చూడండి :) )
సినీమాలో సాహిత్యం నేతిబీరకాయలో నెయ్యిలాంటిది. అయితే దశాబ్దాల నాటకరంగ వారసత్వం బీరకాయకి నెయ్యిని అందించింది. ఇది బీరకాయకి అవసరం కాదు. కోరు కునేదీ కాదు. కాని సాంగత్యం వల్ల అబ్బిన గుణం. నిజానికి సినీమాల్లో సాహిత్యం -కొన్ని దశాబ్దాలపాటు మహారచయితలు-సినీ ప్రక్రియకు సంబంధంలేని-గొప్ప లక్షణాన్ని పోషిస్తూ వచ్చారు. సంబంధం ఎందుకు లేదు? ఈ ప్రశ్నకి సమాధానంలోనే 'నాటకరంగ ప్రభావం' అనే అంశం ఇమిడి ఉంది. థాంక్స్‌ టు థియేటర్‌, లిటరేచర్‌ గేట్‌ క్రాష్డ్‌ ఇన్‌టు సినీమా, బై డిఫాల్ట్‌. వెంటనే ఓ సవరణ చెప్పి నాలుక కరుచుకోవాలి.

సినిమాలో సాహిత్యం ప్రమేయం ఉండ నక్కరలేదు కాని, తెలుగు సినీమాకి సాహిత్యంతో అద్భుతమయిన, విడదీయలేని అనుబంధం ఉంది. కెమెరాముందు కవిత్వం చెప్పడం సినీమా కానేరదు. కాని కెమెరా చెప్పగలిగే భావనలను కళ్ళ ముందు రూపం కనిపించేంత సునిశితంగా మాటల్లో రూపు దిద్దిన సాహితీపరుల చరిత్ర సినీమాతో ముడిపడివుంది. ప్రపంచమంతటా తొలిరోజుల్లో, మనదేశంలో ఇప్పటికీ- సాహిత్యానికీ, సినీమాకీ ఉండగల బంధుత్వాన్ని చాలా విచిత్రంగా వివరించాడు మోరిస్‌ బేజా అనే విమర్శకుడు.

ప్రాచీన కాలంనాటి గ్రీసు దేశంలో సినీమాలు ఉండి ఉంటే ఇవాళ వాటిని సాహితీ రూపాలుగా పఠిస్తూండేవాళ్ళం -అని. వెంటనే నాకు మన భాషలో చెప్పాలనే వ్యామోహం లాగు తోంది. వేదవ్యాసుడికీ, పోతనకీ అలనాడు స్క్రీన్‌ప్లే వ్రాయడం తెలిసుంటే ఇవాళ మనం వాటిని చూసి మహా భారతం, భాగవతం వ్రాసుకునేవారమేమో! సాహిత్యానికీ, మనోనేత్రాన్ని ఆవిష్కరించే ఆపూర్వమయిన స్థాయిలో చిత్రానికీ ఆభేధాన్ని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే. నిజానికి/ అడిగెదనని కడువడిజను/ అడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్‌/ వెడ వెడ సిడిముడి తడబడ/ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్‌

ఇంత గొప్ప దృశ్యాన్ని-స్క్రీన్‌ప్లేని- ఇంతకంటే గొప్పగా ఎవరూ వ్రాయలేరని నాకనిపిస్తుంది. ఈపని పోతన ఏనాడో చేశాడు. నాటకం చేసే, చెయ్యగల అన్ని పనులూ నాటకంకంటే బాగాసినీమా చెయ్యగలదుకాని- ఒక ముఖ్యమైన విషయంలో నాటకానిదే పై చెయ్యి. ఎంత గొప్ప బొమ్మని తెర మీద చూపగలగినా కొన్ని నైరూప్య (్చఛట్టట్చఛ్టి) భావనలు దృశ్యానికి లొంగవు. ఉదాహరణకి బిడ్డ నీ, స్త్రీనీ చూపవచ్చునేమోకాని 'మాతృత్వానికి' దృశ్యం లేదు. అలాగే కావలింతని చూపవచ్చు నేమోగాని 'ప్రేమ'ని చూపలేం. ముద్దుని చూపవచ్చును కాని, సెక్స్‌ని, రక్తాన్ని చూపవచ్చునుగాని 'హింస'నీ, కోపాన్నీ చూపవచ్చునుగాని 'ద్వేషాన్ని' చూపడంలో దృశ్యం వీగిపోతుంది.

ఈ సంద ర్భంలో 'మాట' కొంగుబంగారం. 'నువ్వంటే నాకు ప్రాణం' అన్న భావనని చూపడానికి పది ఫ్రేము లో లేదా ఎంత క్లుప్తంగానయినా నాలుగు సన్నివేశాలో కావాలేమోగాని ఒక్కమాట కథకుడికి తోడ వుతుంది. నిజానికి ఈ పనిని ఇంకా పకడ్బందీగా చేసే మరో లక్షణం కూడా నాటకం ద్వారానే దిగు మతి అయింది. అది సంగీతం, పాట. భారతీయ సంగీతంలో అనుభూతి ప్రధానమయిన విభజన లేదు. అయితే ఆనవాయితీగా ఆయా రాగాల్ని ఆయా సందర్భాలకో, భావనలకో అనువుగా వాడడం రివాజుగా వస్తున్న ఆచారం. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఇంగ్మార్‌ బెర్గ్‌మన్‌ ఓ మాట అన్నాడు: the reason film has more in common with music than with literature is that both film and music affect our emotions directly, not via the intellect.

ఈ అభిప్రాయానికి సాక్ష్యం మన సినీరంగ చరిత్రనంతా ( ఇవాల్టిదాకా) ఉదహరించవచ్చు. పాట లేదా పద్యం-వాస్తవాన్ని వీలయినంత అవాస్తవం చేస్తునే- మరొక పక్క'అవాస్తవాన్ని' అంగీ కరించాలనే ప్రలోభంలో పడేస్తుంది-అది వాస్తవం కాదని ఒక పక్క మనస్సు చెప్తున్నా నాటకం నుంచి పరకాయ ప్రవేశం చేసిన అలనాటి ప్రేక్షకుడు కదిలే బొమ్మని తెరమీద చూస్తూనే, అలవా టయిన నాటకాన్నే చూసి అనందించాడు. కొత్త ప్రక్రియ బతకడానికి ఆనాడు నిర్మాతకీ ప్రేక్షకుడికీ ఏర్పడిన సయోధ్య యిది. క్రమంగా పాట 'అవాస్తవం'అనే స్పృహని మరిచిపోయి 'అలవాటు' చేసు కున్నాడు ప్రేక్షకుడు.

ఓ హీరోయిన్‌ చెట్టుకింద కూర్చుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మేఘంతో అంటోం ది: ఏమయ్యా మేఘం గారూ! వెళ్ళి మా బావకి నేను తననింకా మరిచిపోలేదని చెప్పివస్తావా? అని. ఇలా మాట్లాడే పిల్లని ఎవరయినా చూస్తే వెంటనే కీల్‌పాక్‌కి తీసుకెళ్ళాలి. కానీ కృష్ణశాస్త్రి గారి హృద యంతో, రాజేశ్వరరావుగారి స్వర మాధుర్యంతో ఆ సందర్భాన్ని ఇన్ని సంవత్సరాలు గుండెల్లో దాచు కున్నాం. కళ్ళుపోయిన హీరోగారు 'కనుపాప కరువైన కనులెందుకు? తనవారె పరులైన బతు కెందుకు'? అని అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కవితా హృదయం మనల్ని పులకింపజేసింది. హీరోగారి గుడ్డితనం మీద మనకి జాలికలిగింది.

మొన్నటికి మొన్న జాతీయ స్థాయిలో బహుమతినందుకున్న ఓ పాటలో ఓ పాపులర్‌ చిత్రంలో ప్రధాన పాత్రధారి 'ధిక్కరీంద్ర జిత హిమగిరీంద్రసిత కందరా నీలకందరా, క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నద్రగానమిది అవధరించరా వినితరించరా' అని దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఈ పాట సెకనుకి 24 ప్రేముల వేగంతో కదిలే సినీమాలో భాగం. దాదాపు అన్ని ప్రాంతాల వారినీ అలరించిన సినీమా ఇది. అందరూ విన్నా ఎవరూ అర్థం కోసం తాపత్రయపడనిది. పాట ఒక stylisation.

ఒక మత్తు. ఆ మత్తుకి తలవొంచే ప్రేక్షకుడు కొన్ని మాటలతో, కొన్ని అర్థాలతో, సన్నివేశాలతో వెరసి పాటతో రాజీ పడతాడు. సందర్భం అతన్ని ఆకర్షించింది. ఆ సన్నివేశం అతనికి అర్థమయింది. నచ్చింది. ఆపాట ఆర్ద్రత అతన్ని అలరించింది. మధ్యలో ఎక్కడో మాటల, భావాల అమరిక అతని మేధస్సుకి అంద లేదు. అయినా ఆ అనుభూతికి అతను లొంగిపోయాడు. ప్రేక్షకుడికి ఈ రాజీ తరతరాల వారసత్వం. చాలా దశాబ్దాల ముందునుంచే అర్థంకాని చాలా విషయాలను అర్థమయ్యే సన్నివేశ స్ప­ృహతో సరిపెట్టుకోవడం నాటకం నేర్పింది.

'స్వాతి ముత్యం' రజతోత్సవ సభలో రాజ్‌కపూర్‌, కమల్‌హాసన్‌ మిగతానటులంతా ఉన్నారు. అల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముఖ్య అతిథి. ఉపన్యాసంలోనే ఆవేశంతో 'మయసభ' సీను నటించేశారు. ప్రేక్షకులు ఆనందంగా విన్నారు. సభ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఎన్ని దశాబ్దాలుగా ఈ 'మయసభ'ని ప్రేక్షకులు చూసి, విని ఆనందిస్తున్నారు! ఏ ఒక్కరికయినా, కొంతయినా అర్థమ వుతోందా? వారికానాడు అర్ధమయింది ఎన్టీఆర్‌ దుర్యోధనుడు. 'మయసభ' ఓ రాజరాజు ఆభిజా త్యాన్నీ, అవమాన భారాన్నీ చాటి చెప్పే ఘట్టం. అదివారికి తెలుసు. ఆ అనుభూతి తెలుసు.

మకుటం లేని చక్రవర్తి ఎలా మాట్లాడుతాడు? బహుశా ఇలాగేనేమో. తెలియకపోయినా పరవాలేదు. ఇలాగ మాట్లాడడం, ఎన్టీఆర్‌ వంటి మహానటులు మాట్లాడడం బాగుంది. సబబుగా ఉంది. భారతదేశంలో సినీమా రూపు దిద్దుకున్న తొలిరోజుల్లో నిస్సందేహంగా, నిర్ధుష్టంగా నాటకాలే కెమెరా ముందు నిలిచాయి. ఏ భాషలోనయినా భక్త పుండరీక, రాజా హరిశ్చంద్ర (దాదా సాహెబ్‌ ఫాల్కే) ఉదాహరణలు. తెలుగులో కూడా 1931లో కెమెరా ముందు 'భక్తప్రహ్లాద' నాటకం నిలి చింది.

నేను కూడా సినీరంగం మీద నాటక ప్రభావాన్ని తెలపడానికి నాటకాల జాబితాని ఇక్కడ ఉట్టం కిస్తే చాలును. భారతీయ జన జీవనంలో భాగమైన పౌరాణిక ఇతివృత్తాలు, ఆనాటి నాటకాల మూస లలో సూత్రధారుడు, కంచుకి, బృందగానం, కందార్థాలు, ద్విపదలు, స్రగ్దరలు అన్నింటితో రాజ మార్గంలో తెరముందుకు వచ్చేశాయి. కొన్ని పేర్లు: లవకుశ సీతాకళ్యాణం (1935), ద్రౌపదీ వస్త్రా పహరణం, శ్రీవేంకటేశ్వర మహాత్యం, బాలనాగ మ్మ, భక్త రామదాసు, పాదుకాపట్టాభిషేకం, శంకు తల, మాయాబజార్‌ (1936), శ్రీకృష్ణలీలలు, సతీ సక్కూబాయి, ధృవ, అనసూయ (ఈ రెం డింటికీ సి. పుల్లయ్య దర్శకులు.

1936లో బేడ-అంటే రెండణాలకి ఈ రెండు సినీమాలూ చూపించా రట) దశావతారాలు, శ్రీసత్యనారాయణ వ్రతం, మోహినీ భస్మాసుర, జరాసంధ, భోజకాళి దాసు,భీష్మ, దక్షయజ్ఞం, మదాలస, బ్రహ్మరధం, సుమతి, హరిశ్చంద్ర, మైరావణ, పార్వతీ కళ్యాణం, చెంచులక్ష్మి, గరుడ గర్వభంగం, సీతారామ జననం, భూకైలాస్‌, నారదనారది, చిత్రనళీయం, సారంగధర, తారాశంశాంకం వగైరా. ఇక సాంఘికాలు: చింతామణి, వరవిక్రయం, రంగూన్‌రౌడి, కన్యాశుల్కం, రైతుబిడ్డ, వందేమాతరం, బారిష్టరు పార్వతీశం, గాంధీ రాజ్యం వగైరాలు.

ఈ ఇతివృత్తాలు జనపధం ప్రోదు చేసిన నిధులు. క్రమంగా రచయిత, దర్శకుడు తెలివి మీరి జన బాహుళ్యం అభిమానాన్ని చూరగొన్న ఇతివృ త్తాల్ని పరకాయ ప్రవేశం చేయించారు. 'లవకుశ' లేతమనసులు అయింది. (హాలీవుడ్‌ చిత్రం 'పేరెంట్‌ ట్రాప్‌' మరొక మూలం), మరొక చిత్రం 'ముత్యాల ముగ్గు'. అలాగే సారంగధర 'తూర్పు పడమర' అయింది. రూపాలు మారినా అవే విలువల్ని, అదే మెలోడ్రామాని ఆధారం చేసు కొని- సినీరంగంలో వ్యాపారి, దర్శకుడు సహజీవనం చేశారు. ప్రేక్షకులు ఆదరించే కాక్‌టైల్‌ ఉండగా, సినీమా ప్రక్రియకోసం వేరే పరుగులు ఎందుకు? ఇలాగే హాలీవుడ్‌లోకి కొన్ని వందల బ్రాడ్వే నాటకాలు రాజ మార్గాన ప్రవేశించి ప్రేక్షకుల ఆదరణని చూరగొన్నాయి.

ఎంత సాహిత్యం! ఎన్ని గొప్పపాటలు! ఎన్ని పద్యాలు! అర్థాలు, అవసరాల ప్రమేయం లేకుండా వెండితెరమీద కళ్ళు మిరుమిట్లు గొలి పాయి. నాటకరంగం భారతదేశపు సినీమాకి ఇప్పటికీ మిగిల్చిన అలం కరణ-పాట. అలనాటి త్యాగయ్యలో 30కి పైగా పాటలున్నాయి. 'పవళ క్కొడి' అనే సినీమాలో యాభై పాటలున్నాయి. ఇది భారతదేశంలో రికార్డు. అప్పటి మీరా, అవ్వయ్యార్‌ వంటి చిత్రాలను కేవలం పాటలను దృష్టిలో పెట్టుకునే నిర్మించారు. మరొక ముఖ్యమైన పరిణామాన్ని మనం మరిచిపోకూడదు. 78 సంవత్సరాల వారసత్వాన్ని నాటకం సినీమాకి ఇస్తే-నాటకానికి కనీసం 200 సంవత్సరాల వారసత్వాన్ని సాహిత్యం ఇచ్చింది. ఆ కారణంగా అలవాటుగా సాహిత్యం నాటకంలో బతికింది. అదే అలవాటు సినీమాకీ పాకింది.

ఆ విధంగా సాహిత్యంతో సినీమా బంధుత్వం రెండోతరానిది. ఇక సినీమాల్లో మాటలూ, సన్నివేశాల గురించి. నేనింతవరకూ దాదాపు వంద సినీమాలు రాశాను. కాని ఎప్పుడూ స్క్రీన్‌ప్లే రాయలేదు. నాటకమే రాశాను. 250 సినీమాలపైగా నటించాను. కాని ఎప్పుడూ నూటికి నూరుపాళ్ళూ దృశ్యాన్ని నటించలేదు. పుంఖానుపుంఖంగా సంభాషణలు వల్లించాను. ఎప్పుడో 61 సంవత్సరాల క్రితం (1947) సన్ని వేశం ఒకటి గుర్తుకొస్తోంది. గుడిముందు ఓ బిచ్చగత్తె చలిలో వణుకు తోంది. ఒకాయన అటుపక్కనుంచి వెళ్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూశాడు. గుడిలో అమ్మవారి చుట్టూ ఖరీదయిన చీరె. అదీ చూశాడు.

సరాసరి వెళ్ళి అమ్మవారి చీరె తెచ్చి బిచ్చగత్తె వొంటిచుట్టూ కప్పి వెళ్ళిపోయాడు. ఈ పాత్ర-వేమన. చిత్రం 'యోగివేమన'. ఈ సన్నివేశం ఓ దృశ్యకావ్యం. ఆ తర్వాత చూసే రెండున్నర గంటల చిత్రానికి ప్రాతిపదిక. ఇక పాత్రీకరణ వేరే అక్కరలేదు. ఈ సన్నివేశంలో సంభాషణలేదు. ఇది నా మనస్సులో యాభై సంవత్సరాలు బతికిన నికార్సయిన దృశ్యకావ్యం. సృష్టికర్త- తెలుగు సినీమా గర్వించదగ్గ మహాదర్శకులు కె.వి.రెడ్డి. అందరికీ నాటకమే ఊపిరి-తీసేవారికీ, చూసేవారికీ. అప్పటికీ, ఇప్ప టికీ. ఒక ప్రక్రియని మరో ప్రక్రియకి తర్జుమా చేసుకోవడం ఒకసారి వండి న పదార్ధాన్ని మళ్ళీ వేడిచేసుకోవడం లాంటిది. అయినా ఎవరూ ఇబ్బంది పడలేదు. వేడిచేసుకునే తిన్నారు, తింటున్నారు.

Thursday, February 21, 2008

చవటాయను నేనూ !

(ఆంధ్రజ్యోతి కోసం రాజగోపాల్ 'సరదాగా' వ్రాసిన రచనలో క్లైమాక్సు ట్విస్టు అదిరింది)

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకాయనా, జూనియర్‌ నేత ఒకాయనా ఢిల్లీ వీధుల్లో పిచ్చిపిచ్చిగా తిరిగేస్తున్నారు. సోనియాగాంధీ దర్శనభాగ్యం కోసం వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు.

అరవై ఏళ్ళు పైబడ్డ సీనియర్‌ నేత ఢిల్లీ చలికి గజగజా వణికిపోతూ, శాలువాని గట్టిగా బిగించి పాటందుకున్నాడు.
"మీటింగు ఎటూ లేదు ... పాటైనా పాడు బ్రదర్‌! రాజధాని నగరంలో వీధి, వీధి నీదీ, నాదే బ్రదర్‌! కాంగ్రెస్‌ పార్టీలో పెళ్ళి కూడా చావులాంటిదే బ్రదర్‌!''
జూనియర్‌ నేత ఎడారిలో తప్పిపోయిన పసివాడిలా భోరున ఏడుస్తూ మరో పాట ప్రారంభించాడు.
"అమ్మా ... చూడాలీ! ... నిన్నూ నేనూ కలవాలీ ... ఊరికి మళ్ళీ పోవాలీ ... ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలీ? ... అమ్మా ... అమ్మా?''
జంతర్‌ మంతర్‌ దగ్గర ఓ సాధువు వాళ్ళని ఆపి పలకరించాడు.

"నాయనలారా! మీ బాధ నాకర్థమైంది ... ఆ మూలన గంపమీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్న యోగిని ఉంది, చూశారూ! గంపదేవేరి ఆవిడ పేరు ... ఆవిడ కళ్ళు తెరిచి, ఎవర్ని చూసి ఆశీర్వదిస్తుందో వాళ్ళకి సోనియాగాంధీ దర్శనం తప్పకుండా లభిస్తుంది...'' అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు.
సీనియర్‌ నేత, జూనియర్‌ నేత పరిగెత్తుకుంటూ వెళ్ళి గంపదేవేరి కాళ్ళ దగ్గర సాగిలబడ్డారు. ఆమె కళ్ళు తెరిచి వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి, చెయ్యెత్తి ఆశీర్వదించి, మళ్ళీ ధ్యానముద్రలో పడింది.

ఇద్దరూ అయోమయంలో పడ్డారు. తమలో ఎవర్ని చూసి గంపదేవేరి నవ్విందో, ఎవర్ని ఆశీర్వదించిందో వాళ్ళకి అర్థం కాలేదు. "నన్నంటే నన్ను'' అంటూ ఇద్దరూ వాదులాటకి దిగారు.
"నన్నే చూసీ నవ్విందీ ... నన్నే బ్లెస్సు చేసిందీ ... అమ్మని కలిసే గోల్డెన్‌ ఛాన్స్‌ నాకే తప్పక వస్తుందీ ...''
ఇద్దరి గొడవ శ్రుతి మించడంతో గంపదేవేరి భరించలేక, మళ్ళీ కళ్ళు తెరిచి పద్యం అందుకుంది.
"కుంభకర్ణుడి నిద్ర వదిలించుకుని లేచి ... కేకలు వేసి, చాలా గగ్గోలు చేసి, హస్తిన కేతెంచి సకిలించు ... కొంటె, చవట, నాప ...''
"వన్స్‌ మోర్‌ ప్లీజ్‌'' ప్రాధేయపడ్డారు ఇద్దరూ.
"కొంటె, చవట, నాప ఎవ్వరో ... వానిని బ్లెస్సు చేసినాను ... ఆఆఆ ...'' పద్యం ముగించి, మళ్ళీ కళ్ళు మూసుకుంది గంపదేవేరి.
సీనియర్‌ నేత, జూనియర్‌ నేత మళ్ళీ తగువు మొదలెట్టారు.
ఇద్దరూ: చవటా ... వట్టి చవటా .. శుద్ధ చవటా ... పరమ చవటా ...
జూనియర్‌: చవటాయను నేనూ! వట్టి చవటాయను నేనూ ...
సీనియర్‌: నీ కంటే పెద్ద చవటాయను నేనూ! వట్టి చవటాయను నేనూ! కావాలంటే క్వాలిఫికేషను చెబుతా వింటేనూ...'!

ఇద్దరూ: చవటాయను నేనూ ...
సీనియర్‌: పదవులు రాక, ఏ పని లేక కొత్త అవతారమెత్తాను ... సెపరేట్‌ స్టేటూ కావాలంటూ మొసలి కన్నీళ్ళు కార్చాను ... చవటాయను నేనూ!''
జూనియర్‌: సిగ్గూ బిడియం గాలికి వదిలి, వైఎస్‌ భజనలు చేశానూ ... ఊరి జనానికి కనబడకుండా ఇంట్లోనే దాక్కున్నాను ... చవటాయను నేనూ...''
ఇద్దరు నేతలూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కలబడి కొట్టుకోవడం ప్రారంభించారు. జుత్తులు చెరిపేసుకున్నారు. చొక్కాలు చింపేసుకున్నారు.
గంపదేవేరికి మళ్ళీ ధ్యానభంగం కావడంతో, కళ్ళు తెరిచి, ఇద్దర్నీ ఒక్క కసురు కసిరింది.
"ఫొండి ... ఫొండి ... మీ ర్రాష్టానికి తక్షణమే వెళ్ళండి ... మీలో ఎవరు చవటలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు ... అప్పుడు దొరుకుతుంది సోనియా దర్శనం ...''
సీనియర్‌, జూనియర్‌ నేతలిద్దరూ మొహాలు వేలాడేసుకుని హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యారు.

***
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, 'కాకా' వెంకటస్వామి హైదరాబాద్‌లో మళ్ళీ సంచలన ప్రకటన చేశాడు.
"తెలంగాణకు వైఎస్సే అడ్డం ... ఆయన తలచుకుంటే రేపే తెలంగాణ వస్తుంది.''
వైఎస్‌ ఇది విని కాకాకు ఫోన్‌ చేశాడు. "తెలంగాణకి అడ్డం, నిలువూ ఎవరూ లేరు కాకాజీ! నేను తలుచుకుంటే తెలంగాణ రేపే వస్తుందని మీకు నమ్మకం ఉందా?''
"గ్యారంటీగా వస్తుంది ... నువ్వు గట్టిగా తలుచుకుంటే రేపే తెలంగాణ వస్తుంది'' అన్నాడు వెంకటస్వామి. "సరే, అయితే ... రేపే తెలంగాణ వస్తోంది'' అని ఫోన్‌ పెట్టేశాడు వైఎస్‌.

వెంకటస్వామికి ఆనందంతో మతిపోయినంత పనయింది. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆ రాత్రి ఆయనకి నిద్రపట్టలేదు. మర్నాడు ... ఉదయమైంది ... మధ్యాహ్నమైంది ... సాయంత్రమైంది ... ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్టు ఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వెంకటస్వామి కంగారుగా వైఎస్‌ దగ్గరికి వెళ్ళాడు.
"ఇదేమిటి వైఎస్‌! తెలంగాణ రేపే వస్తుందన్నావు ... ఇప్పటిదాకా ఎనౌన్స్‌మెంటు రాలేదు ...''
వైఎస్‌ చిరునవ్వు నవ్వి అన్నాడు. "ఆడి తప్పడం మా వంశంలో లేదు కాకాజీ! నేనన్న మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ... మీరిలా అడుగుతారని తెలిసి బోర్డు మీద కూడా రాయించి పెట్టాను ... కావాలంటే రోజూ వచ్చి ఆ బోర్డు చూసుకుని వెళ్ళండి'' అంటూ ఓ బోర్డు చూపించాడు. దాని మీద ఇలా రాసి ఉంది.
"తెలంగాణ తప్పకుండా రేపే వస్తుంది ... దీనికి మీరే సాక్షి!'' rajagopal_mangu@rediffmail.com

Monday, February 11, 2008

తల్లులని ఎన్నుకొనే రోజులొచ్చాయి

దారి తప్పుతున్నాం జాగ్రత్త!
- అంధ్ర జ్యోతి కోసం యం.వి.రమణారెడ్డి

ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను.

నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. ప్రామాణిక భాషలో కథ వ్రాసి, దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్‌. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది.

మనకు హైదరాబాదులో తెలుగుతల్లి విగ్రహముంది. కొంతమంది ఆ విగ్రహాన్ని చూడగానే, ఈమె విజయవాడనుండో కాకినాడనుండో వచ్చిన ఆడమనిషి అనుకుంటున్నారే తప్ప, తల్లి అనే భావనతో చూడకపోవడం గమనిస్తే మనసు చివుక్కుమంటుంది. వాళ్ళు పరాయివాళ్ళయినా కాదు. తెలుగు బిడ్డలే. మరి వాళ్ళకు ఈ వికారం ఎందుకు కలిగింది? కుటుంబం నుండి విడిపోవాలనే భావన వాళ్ళకు కలిగింది కనుక. కలిసుంటామా విడిపోతామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అన్నదమ్ములు కలిసున్నా విడిపోయినా తల్లి మారదు.

విడిపోవాలనే భావం కలిగినంత మాత్రాన తల్లిని మార్చుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన ఇది వరకు ఎక్కడా వినలేదు. కలిసున్నా విడిపోయినా మనకు తల్లి మాత్రం ఒకటే ఉంటుందని చాటిచెప్పే విధంగా, తిరుపతిలో తెలుగుతల్లి రథోత్సవం జరిపించిన నా తమ్ముళ్ళను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడనుకున్నామే, ఈ రాజకీయప్రభాలు, ఈ ప్రాంతీయ విభేదాలు, ఇవి కలిగించే ప్రకంపనాలు, తెలుగు సాహిత్యాన్ని గూడా సోకినా యి. అది తప్పదు. అది మనకు ఇక్కడ కొత్తగా జరుగుతున్న విశేషమేంగాదు. ప్రపంచంలో అన్ని చోట్లా జరిగేదే. సమాజాన్ని కదిలించే ఏ ప్రకంపనైనా సాహిత్యాన్ని తాకుతుంది.

తెలుగు సాహిత్యంగూడా మార్పును స్వీకరించింది. అనేకమంది రచయితలు, ముఖ్యంగా కథా రచయితలు, తమ ప్రాంతీయ మాండలికంలో రాయ డం మొదలుపెట్టినారు. నిన్నా మొన్నటివరకూ ప్రామాణికభాషనే మనమంతా ఉపయోగించాం. కానీ, ఈ తరం రచయితలు దాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు. రాజకీయాలు కానివ్వండి, ప్రాంతీయ మనస్తత్వం కానివ్వండి, కారణం ఏదైనా, నా ప్రాంతంలో వాడే మాండలికాన్నే నేను రాస్తాను, నా ప్రాంతంలో వాడే యాసలోనే రాస్తాను. ఇంకొకరి భాష నేనెందుకు వ్రాయాల?-అనే పరిస్థితి వచ్చేసింది.

ఇంకొకరి భాష అంటే కోస్తావాళ్ళ భాష అనే అర్థంలో, ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను. ఎందుకు అనే వివరణకు పోయేముందు ఈ పరిస్థితి దాపురించడానికి దోహదం చేసిన కారణాలు కొద్దిగా చర్చించుకోవడం మంచిదని నా అభిప్రాయం. వాటిల్లో మొదటిది మన కోస్తాసోదరుల ప్రవర్తన. దాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను.

రాయలసీమ ప్రాంతంలో తండ్రి తల్లిని 'జేజి' అంటారు. కోస్తాలో 'నాయనమ్మ' అంటారు. నాయనమ్మ అనేది తేలికైన రెండు పదాల కలయిక. చిన్నపిల్లలు, ఇంకా భాష సరిగారానిసమయంలో నాయనకు అమ్మకాబట్టి నాయనమ్మ అంటూ తేలిగ్గా వాళ్ళకు వాళ్ళు కూర్చున్నమాట. జేజి పదం అలా తయారైంది కాదు. అది తెలుగుభాష ప్రత్యేకతను సూచించే పదం. సంస్క­ృతానికీ తెలుగుకూ ఉన్న తేడాను తెలియచేసే పదం. కుటుంబ సంబంధాలను విడివిడిగా, స్పష్టంగా తెలియజేసే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అత్త, కోడలు వంటి పదాలు సంస్క­ృతానికి లేవు. అవి తెలుగులోనే దొరుకుతాయి.

మన భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించే పదాల్లో జేజి అనే పదం కూడా ఒకటి. అందువల్ల అది మనం పోగొట్టుకోవడానికి కూడా వీల్లేని మేలిమి. అలాంటి పదా న్ని చులకన చేసి 'జేజి ఏమిటండీ జేజి. చక్కగా నాన మ్మా అని పలకలేరా?' అంటూ ముఖం చిట్లించుకుంటారు కోస్తా సోదరులు. వెంటనే మనం చిన్నబోతాం. మనం కూడా 'నానమ్మ ఏంటండీ నానమ్మ. చక్కగా జేజి అని పలకలేరా?' అని అడగచ్చు. కానీ అడగలేం. ఎందుకంటే నా భాష తప్పేమో అనే గిలి మనను వెనక్కు లాగుతుంది. నాది ప్రామాణిక భాష కాదు అనే మానసిక బానిసత్వం మననుజవాబు చెప్పే పరిస్థితిలో లేకుండా గొంతునొక్కేస్తుంది.

ఇలాంటి పోట్లు కోస్తా సోదరుల చేతుల్లో ఇతర ప్రాంతాల రచయితలూ సామాన్యులూ లెక్కలేనన్ని సార్లు అనుభవించారు. ఈ పరిస్థితి ఇలావుంటే, పుండుమీద కారం చల్లినట్టు చేస్తున్నాయి తెలుగుసినిమాలు. రౌడీకి రాయలసీమ యాస, విదూషకునికి తెలంగాణ యాస, హీరోకు కోస్తా యాస ఉపయోగించడం సినిమా రచయితలకు అలవాటైపోయింది. ఇక సినిమా కథలందామా, ఏదోవొక ఫైన్‌మార్నింగ్‌ ఆ రచయిత తలకాయలో ఒక క్రైమ్‌ కథ మొలుస్తుంది. అది ఏ ప్రాంతంలో జరిగినట్టు తడుతుందంటే రాయలసీమలో జరిగినట్టు తడుతుంది.

ఆ మొలిచిన కథకీ, రాయలసీమ వాస్తవిక జీవితానికీ ఏ మాత్రం పొత్తుండదు. ఆ రచయిత రాయలసీమలో గడపటానికి తన జీవితంలో అర్ధరోజైనా కేటాయించి ఉండడు. అతనికి రాయలసీమజీవితం తెలియదు, భాష తెలియదు, సంస్క­ృతీ తెలీదు. కోస్తా యాజమాన్యాల గుత్తాధిపత్యంలో నడిచే పత్రికల ద్వారా సంపాదించిన తప్పుడు సమాచారంతో రాయలసీమను ఊహించి తన బుర్రలో పుట్టిన క్రైమ్‌నంతా రాయలసీమమీద రుద్దుతాడు. ప్రతినిత్యం అంతపెద్ద తెరమీద, అంత విస్త­ృతమైన మీడియాలో రాయలసీమ పేరుబెట్టి అడ్డమైన వాచకాలు వాగుతూంటే చూసేవాళ్ళకు ఎలాగుంటుందండీ? వాస్తవంగా అది రాయలసీమ జీవితాన్ని ప్రతిబించేదే అయితే మనకు సంతోషమే! రాయలసీమ సంస్క­ృతినో, బాధలనో ప్రతిబింబించేదైతే సంతోషమే. కానీ అలా జరగడం లేదు.

ఉద్దేశపూర్వకంగా రాయలసీమను కించపరిచే పద్ధతి లో తయారైన సినిమాను అంతపెద్ద తెరమీద చూస్తున్నప్పుడు ఎవరికైనా గుండెల్లో మండుతుంది. కాబట్టి, అందరికిలాగే మన రచయితలకు కూడా మండింది.వాళ్ళ భాషలో నేనెందుకు వ్రాయాలి. నా భాషలోనే, నా ప్రాంతంలోనే వాడే మాండలికంలోనే నేను వ్రాయాలి-అనే పట్టుదల పెరిగింది. ఈ వాదన తో నేను పూర్తిగా ఏకీభవించలేనని ఇది వరకే సూచించాను. ఎందుకంటే మనం ఇంతవరకూ ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణికభాషను ఎవడో కోస్తావాడు వచ్చి ఇది నా భాష అంటూ దొమ్మీగా లాక్కుపోతుంటే చూసి ఊరుకోటానికి నేను సిద్ధంగా లేను.

నాకు తెలిసి మనం ఉపయోగిస్తున్న ప్రామాణికభాషను యధాతథంగా వాడుతున్న జిల్లా ఒక్కటైనా నాకు కోస్తాలో కనిపించలేదు. జిల్లా జిల్లాకూ యాసమారుతుంది. వ్యవహారశైలి మారుతుంది. ఐతే, ఒక్క విషయం మనం అంగీకరించకతప్పదు. మనం ఉపయోగించే ప్రామాణికభాష కోస్తా వ్యవహారానికి దగ్గరగా ఉండటం వాస్తవం. దానికి చారిత్రిక కారణాలు చాలా ఉన్నాయి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నామాండలికానికి కూడా హోదాకావాలనే పట్టుదల పెరిగింది. మంచిదే. ఆ ప్రయత్నం మొదలెట్టండి. వాడిదొద్దు వీడిదొద్దు అనుకంటూ ఉన్నది కాస్తా ఊడగొట్టుకుంటే నష్టం తప్ప లాభముండదు.

అలాకాకుండా అచ్చమైన తెలుగుపదాలకోసం గ్రామసీమల్లో వెదకండి. పాశ్చాత్యనాగరికతకు దూరంగా ఉండే గ్రామసీమల్లో వెదకండి. సామాన్యమైన మానవ సంబం« దాలు, దినసరి వ్యవహారాలు నెరపటానికి అవసరమైన పదాలు ప్రతిభాషకూ ఉంటాయి, మనకూ ఉన్నా యి. అలాంటి పదాలు వెదికి తీయండి. అపభ్రంషంగా మారిన పదాలు ఉంటే వాటిని సంస్కరించండి. అప్పుడు మాండలికపదాల భాండాగారం తయారౌతుంది. రాయలసీమ గ్రామాల్లో, తెలంగాణ గ్రామా ల్లో వాడే పదాలను తీసుకొచ్చి ప్రామాణికభాషలో చేరేట్టు చూడండి. దానివల్ల తెలుగుభాష పరిధి పెరుగుతుంది. తెలుగు భాష విస్త­ృతమౌతుంది.

అయితే, ఆ దిశగా మన కృషి ఏ మేరకు జరుగుతూందంటే, దాదాపు జరగడం లేదనే చెప్పుకోవాలి. ప్రాంతీయ ప్రాముఖ్యత కావాలని కోరుకొనే రచయితలు ఎన్నుకుంటున్నది ఆ ప్రాంతంలో వాడే మాండలిక పదాలు కాదు, మాండలిక యాస మాత్రమే. అదైనా అందరికీ చేతనౌతూందా? పులికంటి కృష్ణారెడ్డి వంటి ముగ్గురు నలుగురు రచయితలకు తప్ప, మిగతావారికి అదిగూడా చేతకావడం లేదు. ఎందుకు చేతగాదంటే, ఏ పల్లెటూర్లో ఆ యాసవాడుతున్నారో, ఆ పల్లెతో నీ బొడ్డు తెగిపోయింది. కానీ, నా మాండలికంలో రాయాలనే కుతి పెరిగింది.

నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. అది వ్రాయటానికి ఏం చేస్తున్నావ్‌? మొట్టమొదట నువ్వు అలవాటుపడిన ప్రామాణిక భాషలో కథ వ్రాసి, ఆ తరువాత దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్‌. దానివల్ల, కథలో అనవసరమైన కృత్రిమత్వం చోటుచేసుకుంటూందే తప్ప, యాస కుదరటం లేదు. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది. ప్రాంతీయ ప్రాముఖ్యతకోసం యాసను కోరుకుంటున్నాం గదా. మరి నువ్వు కలగనే ప్రాంతానికంతా ఒకే యాసలేదే.

రాయలసీమ తీసుకుంటే చిత్తూరులో ఒక యాస, కడపలో మరో యాస, అనంతపురంలో ఒక యాస, కర్నూలుది మరోయాస. ఒకే జిల్లాలో కూడా ఐదారు రకాల యాసలు మనకు కనిపిస్తాయి. కడపయాసలో రాసింది పక్కనున్న చిత్తూరు, అనంతపురాలకు చదవడమే కష్టమౌతుంది. దానివల్ల పాఠకుల సంఖ్య కుదించుకుపోతుంది. పాఠకుల సంఖ్య తగ్గితే ఆ సాహిత్యం వల్ల సమకూరే ప్రయోజనం ఎంత అనేది నా సందేహం. కాబట్టి, మనం ఒక దిశగా చెయ్యవలసిన ప్రయాణాన్ని మరో దిశగా, చేరవలసిన గమ్యానికి సరిగ్గా వ్యతిరకమైన దిశగా చేస్తున్నామేమోనని నా అనుమానం.

ఇదేదో కొత్త ప్రయోగమని మనం మొదలెట్టామే, ఈ మాండలిక ప్రయోగం చాలా చాలా పురాతనమైనది. బ్రిటన్‌లో ఇంగ్లీషంతా ఒకరకంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. అందులో 43రకాల ఉచ్చారణా తేడాలు ఉన్నాయి. బెర్నార్డ్‌ షా రచించిన 'పిగ్మ్యాలియన్‌' నాటకం చదివితే కొంతవరకూ తెలిసొస్తుంది. 'డయలెక్ట్స్‌'తో వేగలేక వాళ్ళు కూడా చివరకు 'ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌' పేరుతో ప్రామాణిక భాషను రూపొందించుకునే అవసరం కలిగింది. చారిత్రికంగా అది తప్పనిపరిస్థితి. ఈపరిణామాలను గమనించకుండా ఇప్పుడు మనం ఒక ఎమోషనల్‌ మూడ్‌లో మాండలిక తెలుగును ఉద్ధరించటానికి మారుగా, మాండలిక యాసకోసం పాకులాడుతున్నాం.

కాబట్టి, తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం, ఒక ప్రామాణికభాష అవసరాన్ని గుర్తించ వలసిందిగా సభకు విజ్ఞప్తిచేస్తూ- ఆ ప్రామాణిక భాష కోస్తాదా, రాయలసీమదా, తెలంగాణదా లేక అందరికీ సమ్మతమైన మరొకటా అనేది తరువాతి సంగతి. ముందు తెలుగుభాష బతికుంటే కదా నీ మాం డలికమా, నా మాండలికమా అని తేల్చుకోవాల్సిన సమస్య ఉత్పన్నమయ్యేది! తెలుగు వ్యాకరణం పేరుతో మనం బోధించే పుస్తకాలను చూస్తే, మన భాష స్థాయి ఏమిటో మనకు కనువిప్పు కలుగుతుంది.

పదాలను విభజించినప్పుడు మనకు మొట్టమొదట తారసపడేది 'తత్‌ సమము'. తత్‌ అంటే ఏమిటో మీకందరికీ బాగా తెలుసు. సంస్కృతానికి సమానమైన పదానిది మన తెలుగు వ్యాక రణంలో మొదటిస్థానం. ఆ తరువాతది 'తత్‌ భవము'. అంటే సంస్కృతంనుండి పుట్టిన పదానిది ద్వితీయ స్థానం. నువ్వు అచ్చతెనుగు అనుకుంటున్నావే, దానికి నీ వ్యాకరణంలో ఇచ్చింది మూడోస్థానం. నువ్వు విప్లవాత్మకంగా భావిస్తున్నావే, ఆ మాండలికం నాల్గవస్థానంలో గ్రామ్యంగా ముచ్చటించబడి, సాహి త్యానికి అనర్హమైన భాషగా వెలివేయబడింది. మరి ఆ వ్యాకరణాన్నే భావితరాలకు బోధిస్తున్నాం. ఇకపోతే నిఘంటువులు.

అవి పేరుకు మాత్రమే తెలుగు నిఘంటువులు. పాత గ్రాంధికభాషా సాహిత్యాన్ని ముం దేసుకుని, ఆ పురాతన కవులు వాడిన సంస్కృతపదాలకు అర్థం చెప్పడం, ఉదాహరణలు చూపడం తప్ప తెలుగు వాసనే వాటికి లేదు. మరి చుట్టూ ఇన్ని తప్పులు పెట్టుకుని, వాటిని సవరించే ప్రయత్నం చేయ కుండా, నా తెలుగో నా తెలుగో అని పేద అరుపులు అరిస్తే ప్రయోజనం ఏముంది? ఈ ఆధునిక యుగం లో ముందుకు పోవటానికి నీ భాషకు ఇప్పటిదాకా సరైన నిఘంటువు లేదు, సరైన వ్యాకరణం లేదు, దానికి తోడు ప్రామాణిక భాషను గూడా లేకుండా చేసుకోవడం మంచిదో కాదో సభికులే ఆలోచించ వలసిందిగా కోరుతున్నాను.

Labels: