Thursday, October 25, 2007

'ఇంటి'గుట్టు

''ఇల్లు ఇల్లనియేవు
ఇందిరమ్మనియేవు
నీ ఇల్లు ఎక్కడే చిలుకా'' అని తెలుగునాట జనం 'డబ్బో దిబో' అంటున్నారు- 'ఇంటిగుట్టు ఇందిరమ్మకు చేటు' అనే సరికొత్త సామెత వినిపిస్తుంటే సతమతమయిపోతున్నారు.

'ఇల్లు దగా, బిల్లు దగా
కుడి ఎడమల దగా దగా' అనే మాట వినిపిస్తుంటే 'లక్కు' తోచక బాధపడుతున్నారు. 'ఇల్లు కట్టి చూడు' అనేది ఒకప్పుడు జనానికి సవాల్‌ అయితే 'బిల్లు కట్టి చూడు' అనేది ఖజానాకు సవాల్‌ అయిపోయింది.

'చూడు చూడు మేడలు
అక్రమాల జాడలు' అని
'వేలు'ఎత్తి చూపిస్తుంటే ఎంత ఇంటికి అంత అక్రమం కనిపిస్తోంది. అవకతవకలకు ఎంత గట్టి పునాదులో అనిపిస్తోంది. క్యాషు కొట్టేశామని ఒప్పుకొంటే చాలు, సిబ్బంది మీద కేసు బెడద లేకుండా చేస్తామని సి'మెంటాలిటీ'తో ఏలినవారు ఊరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొన్ని అన్యాయమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనర్హులకు ఇళ్లు ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం ఘోరం! అర్హులకు ఇళ్లు ఎవరయినా ఇస్తారు. అందులో ఘనత ఏముంది? అనర్హులకు ఇస్తేనే 'ప్రభువులకు ఎంతదయో' అన్న విషయం తెలుస్తుంది, అసలు సిసలు గొప్పతనం బయటపడుతుంది! అనర్హులంటే గొప్పవాళ్లు. నిజానికి వాళ్లకు మట్టి అంటకుండా చేయగలగడమే నిజమైన ప్రజాసేవ.

మహాత్మాగాంధీ పేరు మీద ఇందిరమ్మ ఇళ్లల్లో ఒకటి కడితే తప్పేమిటి? ఇందిరమ్మ పేరు మీద పెద్ద పథకమే ప్రవేశపెడుతున్నప్పుడు ఆమె పేరు మీద ఒక ఇల్లు లేకపోతే ఎంత అన్యాయం? ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరు మీద ఇళ్లు ఇందిరమ్మ పథకంలో ఉంటే చుట్టుపక్కల ప్రజలకు ఎంత ధైర్యం! తమ మీద ఈగ కూలదన్న నమ్మకం కలుగుతుంది. అందుకే దివంగతులైన పితృదేవతలు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం క్యూ కడుతున్నారు. ఇంతకంటే ఏ పథకానికయినా ఏం కావాలి?

బాగా బతకడానికి నాలుగు 'రాళ్లు' వెనకేసుకోవాలని తొలుత చెప్పిన మహానుభావుడు ఎంతటి గృహనిర్మాణ నిపుణుడో, ఇందిరమ్మ పథకం రాకముందే ఎంతముందు చూపుతో అన్నాడోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇల్లు చూస్తే ఇల్లు ఫీలింగ్‌కన్నా ఎక్కువగా ఇల్‌ఫీలింగ్‌ కలుగుతోందని సామాన్యులు అంటుంటే ఏమి ఈ (అయో)'మయుని' గృహరచనా చమత్కృతి అనిపిస్తుంది!

ఇల్లు ఉండీ లేనట్టును, లేకపోయినా ఉండినట్టును తోస్తోంది. ఇంతకన్నా (స్వ) జనరంజకమయింది ఏముంటుంది? ఏప్రిల్‌ నెల నుంచి ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నా ఏక్‌'ఫూల్‌' అనేక్‌ మాలీ అనిపిస్తుంది! ఏ పక్క చూసినా పక్కాఇల్లు కనబడాలనేది ఎంత గొప్పలక్ష్యం! 'తక్కువ తిన్నవాడు' ఎవడూ లేకపోవడమే కదా లోకకల్యాణం. దానిని మరిచి 'లక్ష్యం తక్కువ- భక్ష్యం ఎక్కువ' అని విమర్శిస్తే వచ్చే జన్మలోనైనా నిలువనీడ ఉంటుందా? పది రూపాయలు తిన్నా ఫర్వాలేదు, పారదర్శకత ఉండాలన్నది 'పక్కా' రాజనీతి!

గృహనిర్మాణాన్ని నిత్యనూతనంగా తీర్చిదిద్దడం కన్నా కావలసిందేముంటుంది? పాతసీసాలో కొత్త సారా అన్న మాటకు బదులు 'పాత ఇళ్లకు కొత్త రంగులు' అనే మాటను జనం సృష్టించుకున్నారు. పగలల్లా కష్టపడి ఇంటికి చేరుకునే వేళకు ఇల్లు ఏ రంగులో కనిపిస్తుందోనని కలలు కంటున్నారు. 'హంగులు తక్కువ... రంగులు ఎక్కువ' అని లేతబుర్రలు కొక్కిరిస్తే వాటితో మనకేం పని?

రాజశేఖర రెడ్డీ మేడ్‌ ఇళ్లు అంటే మజాకా? 'అవినీతి అంతర్జాతీయ సమస్య' అని ఇందిరమ్మే చెప్పినపుడు ఇందిరమ్మ పథకం మాత్రం దానికి అతీతంగా ఉండాలని ఎందుకు కోరుకోవాలి? పల్లెబాట, నగరబాట అంటే ఎక్కువమంది ఇష్టం చూపకపోవచ్చు, కానీ అవినీతి బాట అంటే 'కలిసిరాని' అమాయకులు ఎవరు? ఇదే సామూహిక 'సద్వర్తన'!

ఏ పథకానికయినా గీటురాయి ఎంతమంది జనానికి అది ఉపయోగపడిందన్నది కాదు, ఎంత మంది నాయకులు, వారి మందీ మార్బలం బాగుపడ్డారన్నదే! ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారుల విషయంలో 'పేరు'కోసం పాకులాడకపోవడం అపూర్వం! 'ఈ గుప్తనామాలు శతకోటి' అని పాడుతుంటే వీనులకు ఎంతో విందుగా ఉంటుంది. అయినా 'బినామీ' కనబడగానే సునామీ వచ్చినట్టు ఎగిరిపడడం పాలకుల దృష్టిలో హిస్టీరియా అవుతుందేమోగానీ హిస్టరీకాదు. బోగస్‌ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేస్తామని మంత్రిసత్తములు చెబుతుంటే గొప్పవాళ్లకు తిప్పలొస్తాయంటే నమ్మబుద్ధి కావడం లేదు!

'ఇందుగల దందులేదను
సందేహము వలదు ఇందిరమ్మ పథకంలో
ఎందెందు వెదకి చూసిన
అందందే అక్రమాలు-' అని పాడే గాయకుల్లారా! ఎందుకు సమయం వృధా చేసుకుంటారు? చక్కగా భాగవతం చదువుకోండి పుణ్యం వస్తుంది. బాగోతాల జోలికి పోవద్దు. అంతకన్నా 'పాపం' ఏముంటుంది?

(ఈనాడులో శంకరనారాయణ వ్యాఖ్యానం)

0 Comments:

Post a Comment

<< Home