Monday, February 25, 2008

వెండితెరకు నాటకం వెన్నుదన్ను

(ఆంధ్రజ్యోతిలో గొల్లపూడి మారుతీరావు వ్రాసిన వ్యాసం. వ్యాసం చివర్లో ఆయనకు నచ్చిన దృశ్య కావ్యంగా [[యోగివేమన]]ను పెర్కొన్నారు. ఆయనకు నచ్చినంతగా సినిమా నాకూ నచ్చినందుకు సంతోషం వేసింది. కావాలంటే నేనువ్రాసిన టపా చూడండి :) )
సినీమాలో సాహిత్యం నేతిబీరకాయలో నెయ్యిలాంటిది. అయితే దశాబ్దాల నాటకరంగ వారసత్వం బీరకాయకి నెయ్యిని అందించింది. ఇది బీరకాయకి అవసరం కాదు. కోరు కునేదీ కాదు. కాని సాంగత్యం వల్ల అబ్బిన గుణం. నిజానికి సినీమాల్లో సాహిత్యం -కొన్ని దశాబ్దాలపాటు మహారచయితలు-సినీ ప్రక్రియకు సంబంధంలేని-గొప్ప లక్షణాన్ని పోషిస్తూ వచ్చారు. సంబంధం ఎందుకు లేదు? ఈ ప్రశ్నకి సమాధానంలోనే 'నాటకరంగ ప్రభావం' అనే అంశం ఇమిడి ఉంది. థాంక్స్‌ టు థియేటర్‌, లిటరేచర్‌ గేట్‌ క్రాష్డ్‌ ఇన్‌టు సినీమా, బై డిఫాల్ట్‌. వెంటనే ఓ సవరణ చెప్పి నాలుక కరుచుకోవాలి.

సినిమాలో సాహిత్యం ప్రమేయం ఉండ నక్కరలేదు కాని, తెలుగు సినీమాకి సాహిత్యంతో అద్భుతమయిన, విడదీయలేని అనుబంధం ఉంది. కెమెరాముందు కవిత్వం చెప్పడం సినీమా కానేరదు. కాని కెమెరా చెప్పగలిగే భావనలను కళ్ళ ముందు రూపం కనిపించేంత సునిశితంగా మాటల్లో రూపు దిద్దిన సాహితీపరుల చరిత్ర సినీమాతో ముడిపడివుంది. ప్రపంచమంతటా తొలిరోజుల్లో, మనదేశంలో ఇప్పటికీ- సాహిత్యానికీ, సినీమాకీ ఉండగల బంధుత్వాన్ని చాలా విచిత్రంగా వివరించాడు మోరిస్‌ బేజా అనే విమర్శకుడు.

ప్రాచీన కాలంనాటి గ్రీసు దేశంలో సినీమాలు ఉండి ఉంటే ఇవాళ వాటిని సాహితీ రూపాలుగా పఠిస్తూండేవాళ్ళం -అని. వెంటనే నాకు మన భాషలో చెప్పాలనే వ్యామోహం లాగు తోంది. వేదవ్యాసుడికీ, పోతనకీ అలనాడు స్క్రీన్‌ప్లే వ్రాయడం తెలిసుంటే ఇవాళ మనం వాటిని చూసి మహా భారతం, భాగవతం వ్రాసుకునేవారమేమో! సాహిత్యానికీ, మనోనేత్రాన్ని ఆవిష్కరించే ఆపూర్వమయిన స్థాయిలో చిత్రానికీ ఆభేధాన్ని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే. నిజానికి/ అడిగెదనని కడువడిజను/ అడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్‌/ వెడ వెడ సిడిముడి తడబడ/ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్‌

ఇంత గొప్ప దృశ్యాన్ని-స్క్రీన్‌ప్లేని- ఇంతకంటే గొప్పగా ఎవరూ వ్రాయలేరని నాకనిపిస్తుంది. ఈపని పోతన ఏనాడో చేశాడు. నాటకం చేసే, చెయ్యగల అన్ని పనులూ నాటకంకంటే బాగాసినీమా చెయ్యగలదుకాని- ఒక ముఖ్యమైన విషయంలో నాటకానిదే పై చెయ్యి. ఎంత గొప్ప బొమ్మని తెర మీద చూపగలగినా కొన్ని నైరూప్య (్చఛట్టట్చఛ్టి) భావనలు దృశ్యానికి లొంగవు. ఉదాహరణకి బిడ్డ నీ, స్త్రీనీ చూపవచ్చునేమోకాని 'మాతృత్వానికి' దృశ్యం లేదు. అలాగే కావలింతని చూపవచ్చు నేమోగాని 'ప్రేమ'ని చూపలేం. ముద్దుని చూపవచ్చును కాని, సెక్స్‌ని, రక్తాన్ని చూపవచ్చునుగాని 'హింస'నీ, కోపాన్నీ చూపవచ్చునుగాని 'ద్వేషాన్ని' చూపడంలో దృశ్యం వీగిపోతుంది.

ఈ సంద ర్భంలో 'మాట' కొంగుబంగారం. 'నువ్వంటే నాకు ప్రాణం' అన్న భావనని చూపడానికి పది ఫ్రేము లో లేదా ఎంత క్లుప్తంగానయినా నాలుగు సన్నివేశాలో కావాలేమోగాని ఒక్కమాట కథకుడికి తోడ వుతుంది. నిజానికి ఈ పనిని ఇంకా పకడ్బందీగా చేసే మరో లక్షణం కూడా నాటకం ద్వారానే దిగు మతి అయింది. అది సంగీతం, పాట. భారతీయ సంగీతంలో అనుభూతి ప్రధానమయిన విభజన లేదు. అయితే ఆనవాయితీగా ఆయా రాగాల్ని ఆయా సందర్భాలకో, భావనలకో అనువుగా వాడడం రివాజుగా వస్తున్న ఆచారం. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఇంగ్మార్‌ బెర్గ్‌మన్‌ ఓ మాట అన్నాడు: the reason film has more in common with music than with literature is that both film and music affect our emotions directly, not via the intellect.

ఈ అభిప్రాయానికి సాక్ష్యం మన సినీరంగ చరిత్రనంతా ( ఇవాల్టిదాకా) ఉదహరించవచ్చు. పాట లేదా పద్యం-వాస్తవాన్ని వీలయినంత అవాస్తవం చేస్తునే- మరొక పక్క'అవాస్తవాన్ని' అంగీ కరించాలనే ప్రలోభంలో పడేస్తుంది-అది వాస్తవం కాదని ఒక పక్క మనస్సు చెప్తున్నా నాటకం నుంచి పరకాయ ప్రవేశం చేసిన అలనాటి ప్రేక్షకుడు కదిలే బొమ్మని తెరమీద చూస్తూనే, అలవా టయిన నాటకాన్నే చూసి అనందించాడు. కొత్త ప్రక్రియ బతకడానికి ఆనాడు నిర్మాతకీ ప్రేక్షకుడికీ ఏర్పడిన సయోధ్య యిది. క్రమంగా పాట 'అవాస్తవం'అనే స్పృహని మరిచిపోయి 'అలవాటు' చేసు కున్నాడు ప్రేక్షకుడు.

ఓ హీరోయిన్‌ చెట్టుకింద కూర్చుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మేఘంతో అంటోం ది: ఏమయ్యా మేఘం గారూ! వెళ్ళి మా బావకి నేను తననింకా మరిచిపోలేదని చెప్పివస్తావా? అని. ఇలా మాట్లాడే పిల్లని ఎవరయినా చూస్తే వెంటనే కీల్‌పాక్‌కి తీసుకెళ్ళాలి. కానీ కృష్ణశాస్త్రి గారి హృద యంతో, రాజేశ్వరరావుగారి స్వర మాధుర్యంతో ఆ సందర్భాన్ని ఇన్ని సంవత్సరాలు గుండెల్లో దాచు కున్నాం. కళ్ళుపోయిన హీరోగారు 'కనుపాప కరువైన కనులెందుకు? తనవారె పరులైన బతు కెందుకు'? అని అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కవితా హృదయం మనల్ని పులకింపజేసింది. హీరోగారి గుడ్డితనం మీద మనకి జాలికలిగింది.

మొన్నటికి మొన్న జాతీయ స్థాయిలో బహుమతినందుకున్న ఓ పాటలో ఓ పాపులర్‌ చిత్రంలో ప్రధాన పాత్రధారి 'ధిక్కరీంద్ర జిత హిమగిరీంద్రసిత కందరా నీలకందరా, క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నద్రగానమిది అవధరించరా వినితరించరా' అని దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఈ పాట సెకనుకి 24 ప్రేముల వేగంతో కదిలే సినీమాలో భాగం. దాదాపు అన్ని ప్రాంతాల వారినీ అలరించిన సినీమా ఇది. అందరూ విన్నా ఎవరూ అర్థం కోసం తాపత్రయపడనిది. పాట ఒక stylisation.

ఒక మత్తు. ఆ మత్తుకి తలవొంచే ప్రేక్షకుడు కొన్ని మాటలతో, కొన్ని అర్థాలతో, సన్నివేశాలతో వెరసి పాటతో రాజీ పడతాడు. సందర్భం అతన్ని ఆకర్షించింది. ఆ సన్నివేశం అతనికి అర్థమయింది. నచ్చింది. ఆపాట ఆర్ద్రత అతన్ని అలరించింది. మధ్యలో ఎక్కడో మాటల, భావాల అమరిక అతని మేధస్సుకి అంద లేదు. అయినా ఆ అనుభూతికి అతను లొంగిపోయాడు. ప్రేక్షకుడికి ఈ రాజీ తరతరాల వారసత్వం. చాలా దశాబ్దాల ముందునుంచే అర్థంకాని చాలా విషయాలను అర్థమయ్యే సన్నివేశ స్ప­ృహతో సరిపెట్టుకోవడం నాటకం నేర్పింది.

'స్వాతి ముత్యం' రజతోత్సవ సభలో రాజ్‌కపూర్‌, కమల్‌హాసన్‌ మిగతానటులంతా ఉన్నారు. అల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముఖ్య అతిథి. ఉపన్యాసంలోనే ఆవేశంతో 'మయసభ' సీను నటించేశారు. ప్రేక్షకులు ఆనందంగా విన్నారు. సభ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఎన్ని దశాబ్దాలుగా ఈ 'మయసభ'ని ప్రేక్షకులు చూసి, విని ఆనందిస్తున్నారు! ఏ ఒక్కరికయినా, కొంతయినా అర్థమ వుతోందా? వారికానాడు అర్ధమయింది ఎన్టీఆర్‌ దుర్యోధనుడు. 'మయసభ' ఓ రాజరాజు ఆభిజా త్యాన్నీ, అవమాన భారాన్నీ చాటి చెప్పే ఘట్టం. అదివారికి తెలుసు. ఆ అనుభూతి తెలుసు.

మకుటం లేని చక్రవర్తి ఎలా మాట్లాడుతాడు? బహుశా ఇలాగేనేమో. తెలియకపోయినా పరవాలేదు. ఇలాగ మాట్లాడడం, ఎన్టీఆర్‌ వంటి మహానటులు మాట్లాడడం బాగుంది. సబబుగా ఉంది. భారతదేశంలో సినీమా రూపు దిద్దుకున్న తొలిరోజుల్లో నిస్సందేహంగా, నిర్ధుష్టంగా నాటకాలే కెమెరా ముందు నిలిచాయి. ఏ భాషలోనయినా భక్త పుండరీక, రాజా హరిశ్చంద్ర (దాదా సాహెబ్‌ ఫాల్కే) ఉదాహరణలు. తెలుగులో కూడా 1931లో కెమెరా ముందు 'భక్తప్రహ్లాద' నాటకం నిలి చింది.

నేను కూడా సినీరంగం మీద నాటక ప్రభావాన్ని తెలపడానికి నాటకాల జాబితాని ఇక్కడ ఉట్టం కిస్తే చాలును. భారతీయ జన జీవనంలో భాగమైన పౌరాణిక ఇతివృత్తాలు, ఆనాటి నాటకాల మూస లలో సూత్రధారుడు, కంచుకి, బృందగానం, కందార్థాలు, ద్విపదలు, స్రగ్దరలు అన్నింటితో రాజ మార్గంలో తెరముందుకు వచ్చేశాయి. కొన్ని పేర్లు: లవకుశ సీతాకళ్యాణం (1935), ద్రౌపదీ వస్త్రా పహరణం, శ్రీవేంకటేశ్వర మహాత్యం, బాలనాగ మ్మ, భక్త రామదాసు, పాదుకాపట్టాభిషేకం, శంకు తల, మాయాబజార్‌ (1936), శ్రీకృష్ణలీలలు, సతీ సక్కూబాయి, ధృవ, అనసూయ (ఈ రెం డింటికీ సి. పుల్లయ్య దర్శకులు.

1936లో బేడ-అంటే రెండణాలకి ఈ రెండు సినీమాలూ చూపించా రట) దశావతారాలు, శ్రీసత్యనారాయణ వ్రతం, మోహినీ భస్మాసుర, జరాసంధ, భోజకాళి దాసు,భీష్మ, దక్షయజ్ఞం, మదాలస, బ్రహ్మరధం, సుమతి, హరిశ్చంద్ర, మైరావణ, పార్వతీ కళ్యాణం, చెంచులక్ష్మి, గరుడ గర్వభంగం, సీతారామ జననం, భూకైలాస్‌, నారదనారది, చిత్రనళీయం, సారంగధర, తారాశంశాంకం వగైరా. ఇక సాంఘికాలు: చింతామణి, వరవిక్రయం, రంగూన్‌రౌడి, కన్యాశుల్కం, రైతుబిడ్డ, వందేమాతరం, బారిష్టరు పార్వతీశం, గాంధీ రాజ్యం వగైరాలు.

ఈ ఇతివృత్తాలు జనపధం ప్రోదు చేసిన నిధులు. క్రమంగా రచయిత, దర్శకుడు తెలివి మీరి జన బాహుళ్యం అభిమానాన్ని చూరగొన్న ఇతివృ త్తాల్ని పరకాయ ప్రవేశం చేయించారు. 'లవకుశ' లేతమనసులు అయింది. (హాలీవుడ్‌ చిత్రం 'పేరెంట్‌ ట్రాప్‌' మరొక మూలం), మరొక చిత్రం 'ముత్యాల ముగ్గు'. అలాగే సారంగధర 'తూర్పు పడమర' అయింది. రూపాలు మారినా అవే విలువల్ని, అదే మెలోడ్రామాని ఆధారం చేసు కొని- సినీరంగంలో వ్యాపారి, దర్శకుడు సహజీవనం చేశారు. ప్రేక్షకులు ఆదరించే కాక్‌టైల్‌ ఉండగా, సినీమా ప్రక్రియకోసం వేరే పరుగులు ఎందుకు? ఇలాగే హాలీవుడ్‌లోకి కొన్ని వందల బ్రాడ్వే నాటకాలు రాజ మార్గాన ప్రవేశించి ప్రేక్షకుల ఆదరణని చూరగొన్నాయి.

ఎంత సాహిత్యం! ఎన్ని గొప్పపాటలు! ఎన్ని పద్యాలు! అర్థాలు, అవసరాల ప్రమేయం లేకుండా వెండితెరమీద కళ్ళు మిరుమిట్లు గొలి పాయి. నాటకరంగం భారతదేశపు సినీమాకి ఇప్పటికీ మిగిల్చిన అలం కరణ-పాట. అలనాటి త్యాగయ్యలో 30కి పైగా పాటలున్నాయి. 'పవళ క్కొడి' అనే సినీమాలో యాభై పాటలున్నాయి. ఇది భారతదేశంలో రికార్డు. అప్పటి మీరా, అవ్వయ్యార్‌ వంటి చిత్రాలను కేవలం పాటలను దృష్టిలో పెట్టుకునే నిర్మించారు. మరొక ముఖ్యమైన పరిణామాన్ని మనం మరిచిపోకూడదు. 78 సంవత్సరాల వారసత్వాన్ని నాటకం సినీమాకి ఇస్తే-నాటకానికి కనీసం 200 సంవత్సరాల వారసత్వాన్ని సాహిత్యం ఇచ్చింది. ఆ కారణంగా అలవాటుగా సాహిత్యం నాటకంలో బతికింది. అదే అలవాటు సినీమాకీ పాకింది.

ఆ విధంగా సాహిత్యంతో సినీమా బంధుత్వం రెండోతరానిది. ఇక సినీమాల్లో మాటలూ, సన్నివేశాల గురించి. నేనింతవరకూ దాదాపు వంద సినీమాలు రాశాను. కాని ఎప్పుడూ స్క్రీన్‌ప్లే రాయలేదు. నాటకమే రాశాను. 250 సినీమాలపైగా నటించాను. కాని ఎప్పుడూ నూటికి నూరుపాళ్ళూ దృశ్యాన్ని నటించలేదు. పుంఖానుపుంఖంగా సంభాషణలు వల్లించాను. ఎప్పుడో 61 సంవత్సరాల క్రితం (1947) సన్ని వేశం ఒకటి గుర్తుకొస్తోంది. గుడిముందు ఓ బిచ్చగత్తె చలిలో వణుకు తోంది. ఒకాయన అటుపక్కనుంచి వెళ్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూశాడు. గుడిలో అమ్మవారి చుట్టూ ఖరీదయిన చీరె. అదీ చూశాడు.

సరాసరి వెళ్ళి అమ్మవారి చీరె తెచ్చి బిచ్చగత్తె వొంటిచుట్టూ కప్పి వెళ్ళిపోయాడు. ఈ పాత్ర-వేమన. చిత్రం 'యోగివేమన'. ఈ సన్నివేశం ఓ దృశ్యకావ్యం. ఆ తర్వాత చూసే రెండున్నర గంటల చిత్రానికి ప్రాతిపదిక. ఇక పాత్రీకరణ వేరే అక్కరలేదు. ఈ సన్నివేశంలో సంభాషణలేదు. ఇది నా మనస్సులో యాభై సంవత్సరాలు బతికిన నికార్సయిన దృశ్యకావ్యం. సృష్టికర్త- తెలుగు సినీమా గర్వించదగ్గ మహాదర్శకులు కె.వి.రెడ్డి. అందరికీ నాటకమే ఊపిరి-తీసేవారికీ, చూసేవారికీ. అప్పటికీ, ఇప్ప టికీ. ఒక ప్రక్రియని మరో ప్రక్రియకి తర్జుమా చేసుకోవడం ఒకసారి వండి న పదార్ధాన్ని మళ్ళీ వేడిచేసుకోవడం లాంటిది. అయినా ఎవరూ ఇబ్బంది పడలేదు. వేడిచేసుకునే తిన్నారు, తింటున్నారు.

1 Comments:

Blogger Aditya said...

థాంక్స్ నవీన్! మీ బ్లాగ్ భలే! గొపుమా రావు గరి వ్యాసం బాగుంది! సేకరించినందుకు థాంక్స్!
ఆదిత్య
www.gambholajamba.blogspot.com

9:50 AM  

Post a Comment

<< Home