Thursday, February 21, 2008

చవటాయను నేనూ !

(ఆంధ్రజ్యోతి కోసం రాజగోపాల్ 'సరదాగా' వ్రాసిన రచనలో క్లైమాక్సు ట్విస్టు అదిరింది)

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకాయనా, జూనియర్‌ నేత ఒకాయనా ఢిల్లీ వీధుల్లో పిచ్చిపిచ్చిగా తిరిగేస్తున్నారు. సోనియాగాంధీ దర్శనభాగ్యం కోసం వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు.

అరవై ఏళ్ళు పైబడ్డ సీనియర్‌ నేత ఢిల్లీ చలికి గజగజా వణికిపోతూ, శాలువాని గట్టిగా బిగించి పాటందుకున్నాడు.
"మీటింగు ఎటూ లేదు ... పాటైనా పాడు బ్రదర్‌! రాజధాని నగరంలో వీధి, వీధి నీదీ, నాదే బ్రదర్‌! కాంగ్రెస్‌ పార్టీలో పెళ్ళి కూడా చావులాంటిదే బ్రదర్‌!''
జూనియర్‌ నేత ఎడారిలో తప్పిపోయిన పసివాడిలా భోరున ఏడుస్తూ మరో పాట ప్రారంభించాడు.
"అమ్మా ... చూడాలీ! ... నిన్నూ నేనూ కలవాలీ ... ఊరికి మళ్ళీ పోవాలీ ... ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలీ? ... అమ్మా ... అమ్మా?''
జంతర్‌ మంతర్‌ దగ్గర ఓ సాధువు వాళ్ళని ఆపి పలకరించాడు.

"నాయనలారా! మీ బాధ నాకర్థమైంది ... ఆ మూలన గంపమీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్న యోగిని ఉంది, చూశారూ! గంపదేవేరి ఆవిడ పేరు ... ఆవిడ కళ్ళు తెరిచి, ఎవర్ని చూసి ఆశీర్వదిస్తుందో వాళ్ళకి సోనియాగాంధీ దర్శనం తప్పకుండా లభిస్తుంది...'' అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు.
సీనియర్‌ నేత, జూనియర్‌ నేత పరిగెత్తుకుంటూ వెళ్ళి గంపదేవేరి కాళ్ళ దగ్గర సాగిలబడ్డారు. ఆమె కళ్ళు తెరిచి వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి, చెయ్యెత్తి ఆశీర్వదించి, మళ్ళీ ధ్యానముద్రలో పడింది.

ఇద్దరూ అయోమయంలో పడ్డారు. తమలో ఎవర్ని చూసి గంపదేవేరి నవ్విందో, ఎవర్ని ఆశీర్వదించిందో వాళ్ళకి అర్థం కాలేదు. "నన్నంటే నన్ను'' అంటూ ఇద్దరూ వాదులాటకి దిగారు.
"నన్నే చూసీ నవ్విందీ ... నన్నే బ్లెస్సు చేసిందీ ... అమ్మని కలిసే గోల్డెన్‌ ఛాన్స్‌ నాకే తప్పక వస్తుందీ ...''
ఇద్దరి గొడవ శ్రుతి మించడంతో గంపదేవేరి భరించలేక, మళ్ళీ కళ్ళు తెరిచి పద్యం అందుకుంది.
"కుంభకర్ణుడి నిద్ర వదిలించుకుని లేచి ... కేకలు వేసి, చాలా గగ్గోలు చేసి, హస్తిన కేతెంచి సకిలించు ... కొంటె, చవట, నాప ...''
"వన్స్‌ మోర్‌ ప్లీజ్‌'' ప్రాధేయపడ్డారు ఇద్దరూ.
"కొంటె, చవట, నాప ఎవ్వరో ... వానిని బ్లెస్సు చేసినాను ... ఆఆఆ ...'' పద్యం ముగించి, మళ్ళీ కళ్ళు మూసుకుంది గంపదేవేరి.
సీనియర్‌ నేత, జూనియర్‌ నేత మళ్ళీ తగువు మొదలెట్టారు.
ఇద్దరూ: చవటా ... వట్టి చవటా .. శుద్ధ చవటా ... పరమ చవటా ...
జూనియర్‌: చవటాయను నేనూ! వట్టి చవటాయను నేనూ ...
సీనియర్‌: నీ కంటే పెద్ద చవటాయను నేనూ! వట్టి చవటాయను నేనూ! కావాలంటే క్వాలిఫికేషను చెబుతా వింటేనూ...'!

ఇద్దరూ: చవటాయను నేనూ ...
సీనియర్‌: పదవులు రాక, ఏ పని లేక కొత్త అవతారమెత్తాను ... సెపరేట్‌ స్టేటూ కావాలంటూ మొసలి కన్నీళ్ళు కార్చాను ... చవటాయను నేనూ!''
జూనియర్‌: సిగ్గూ బిడియం గాలికి వదిలి, వైఎస్‌ భజనలు చేశానూ ... ఊరి జనానికి కనబడకుండా ఇంట్లోనే దాక్కున్నాను ... చవటాయను నేనూ...''
ఇద్దరు నేతలూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కలబడి కొట్టుకోవడం ప్రారంభించారు. జుత్తులు చెరిపేసుకున్నారు. చొక్కాలు చింపేసుకున్నారు.
గంపదేవేరికి మళ్ళీ ధ్యానభంగం కావడంతో, కళ్ళు తెరిచి, ఇద్దర్నీ ఒక్క కసురు కసిరింది.
"ఫొండి ... ఫొండి ... మీ ర్రాష్టానికి తక్షణమే వెళ్ళండి ... మీలో ఎవరు చవటలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు ... అప్పుడు దొరుకుతుంది సోనియా దర్శనం ...''
సీనియర్‌, జూనియర్‌ నేతలిద్దరూ మొహాలు వేలాడేసుకుని హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యారు.

***
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, 'కాకా' వెంకటస్వామి హైదరాబాద్‌లో మళ్ళీ సంచలన ప్రకటన చేశాడు.
"తెలంగాణకు వైఎస్సే అడ్డం ... ఆయన తలచుకుంటే రేపే తెలంగాణ వస్తుంది.''
వైఎస్‌ ఇది విని కాకాకు ఫోన్‌ చేశాడు. "తెలంగాణకి అడ్డం, నిలువూ ఎవరూ లేరు కాకాజీ! నేను తలుచుకుంటే తెలంగాణ రేపే వస్తుందని మీకు నమ్మకం ఉందా?''
"గ్యారంటీగా వస్తుంది ... నువ్వు గట్టిగా తలుచుకుంటే రేపే తెలంగాణ వస్తుంది'' అన్నాడు వెంకటస్వామి. "సరే, అయితే ... రేపే తెలంగాణ వస్తోంది'' అని ఫోన్‌ పెట్టేశాడు వైఎస్‌.

వెంకటస్వామికి ఆనందంతో మతిపోయినంత పనయింది. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆ రాత్రి ఆయనకి నిద్రపట్టలేదు. మర్నాడు ... ఉదయమైంది ... మధ్యాహ్నమైంది ... సాయంత్రమైంది ... ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్టు ఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వెంకటస్వామి కంగారుగా వైఎస్‌ దగ్గరికి వెళ్ళాడు.
"ఇదేమిటి వైఎస్‌! తెలంగాణ రేపే వస్తుందన్నావు ... ఇప్పటిదాకా ఎనౌన్స్‌మెంటు రాలేదు ...''
వైఎస్‌ చిరునవ్వు నవ్వి అన్నాడు. "ఆడి తప్పడం మా వంశంలో లేదు కాకాజీ! నేనన్న మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ... మీరిలా అడుగుతారని తెలిసి బోర్డు మీద కూడా రాయించి పెట్టాను ... కావాలంటే రోజూ వచ్చి ఆ బోర్డు చూసుకుని వెళ్ళండి'' అంటూ ఓ బోర్డు చూపించాడు. దాని మీద ఇలా రాసి ఉంది.
"తెలంగాణ తప్పకుండా రేపే వస్తుంది ... దీనికి మీరే సాక్షి!'' rajagopal_mangu@rediffmail.com

1 Comments:

Blogger రాజ మల్లేశ్వర్ కొల్లి said...

"తెలంగాణ తప్పకుండా రేపే వస్తుంది ... దీనికి మీరే సాక్షి!''

రెండు వారాలక్రితం భారతం వచ్చినపుడు ఈ "సాక్షి" ప్రకటనలు చూసా..., నాకైతే పిచ్చెక్కి పోయింది.

6:41 AM  

Post a Comment

<< Home